పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జనరంజక పాలన,సంక్షేమ పథకాలు,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామ గౌడ సంఘం సభ్యులు, మోర్తార్ మండల ధర్మోరా గ్రామ యాదవ సంఘ సభ్యులు మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి మీరు నా కుటుంబ సభ్యులనీ అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి వారికి భరోసా కల్పించారు.బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశారు. గుమ్మిర్యాల గ్రామ రైతుల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ధర్మోరా గ్రామంలో అనేక అభివృద్ది పనులు చేశామని అన్నారు.
పార్టీలో చేరి ఇతర సంఘాల సభ్యులకు ఆదర్శంగా నిలిచారని, మీ గ్రామాల్లో అభివృద్ది నా బాధ్యత అని అన్నారు.ఏ పార్టీలో ఉన్న తెలంగాణ బిడ్డే కదా లాభపడేది అని కేసిఆర్ ఎంతో గొప్పగా ఆలోచిస్తారనీ,తెలంగాణలో కేసిఆర్ సంక్షేమ పథకాలు అందని గడప లేదన్నారు. అన్ని పార్టీలకు రాజకీయం ఒక గేమ్ అయితే బిఆర్ఎస్ కు మాత్రం టాస్క్ అని అన్నారు. రైతుల కోసం,పేద ప్రజల కోసం కేసిఆర్ ఎంతో చేస్తున్నాడని తెలిపారు. కొంతమంది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. అట్లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.