తెలంగాణలో గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
దళితబంధు, కల్యాణలక్ష్మి, సబ్సిడీ రుణాలు తదితర పథకాలన్నింటిలోనూ దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలవుతున్నది. తాజాగా గృహలక్ష్మి పథకంలోనూ 5% రిజర్వేషన్‌ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
సొంత జాగ ఉండి, ఇల్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నది. తొలివిడతలో నియోజకవర్గానికి రూ.3వేల చొప్పున సీఎం కోటా కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇందులో 20 వేల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది.