ప్రజలకు సొంతంగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ కంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న’ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారానే ఎక్కువ మంది సేవలు పొందుతున్నట్టు స్వయంగా నరేంద్రమోదీ సర్కారే స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీమాకు అర్హత కలిగిన 68% కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలు అందుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ పథకం కేవలం 32% కుటుంబాలకే వర్తిస్తున్నదని వెల్లడించింది. ‘ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైన పథకం. వ్యాధుల సంఖ్య, కుటుంబాల కవరేజీ విషయంలో ఆరోగ్యశ్రీ వందపాళ్లు నయం’ అని సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇది నిజమేనని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో అంగీకరించింది.
ఇవీ లెక్కలు..
కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 90,10,000 కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉన్నది.ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో 90 లక్షల కుటుంబాలు సేవలు పొందేవి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర క్రితం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేసేందుకు అంగీకరించింది. దీంతో ఈ పథకం ‘ఆయుష్మాన్ భారత్-ఆరోగ్యశ్రీ’గా అమలవుతున్నది.ఆయుష్మాన్ భారత్ కింద తెలంగాణలో 29,02,621 కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తున్నట్టు కేంద్రం చెప్పింది. అంటే మొత్తం లబ్ధిదారుల్లో 32% మాత్రమే.మిగతా 61,07,379 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందుతున్నాయి. మొత్తం లబ్ధిదారుల్లో ఇది 68 శాతం.
తెలంగాణలో ఆరోగ్యశ్రీని పక్కనబెట్టి ఆయుష్మాన్ భారత్‌ను అమలుచేస్తే 70% కుటుంబాలు బీమాకు దూరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే పేర్కొన్నది. అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దాదాపు నాలుగేండ్లపాటు ఈ పథకాన్ని అమలు చేయలేదు. చివరికి రాష్ర్టాల సొంత ఆరోగ్య బీమాను కొనసాగిస్తూనే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయవచ్చని కేంద్రం చెప్పడంతో ఒప్పుకున్నారు.బీజేపీ పాలిత మహారాష్ట్రలో పూర్తిగా ఆయుష్మాన్ భారత్‌పైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తున్నది. వాస్తవానికి మహారాష్ట్ర జనాభా సుమారు 11 కోట్లకుపైగా ఉన్నది. అంటే దాదాపు రెండున్నర కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో కనీసం 1.7 -2 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అవసరం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌ను మాత్రమే అమలు చేస్తుండటంతో దాదాపు సగం కుటుంబాలకు బీమా అందడం లేదు.గుజరాత్ రాష్ట్రంలో 82 లక్షల కుటుంబాలకు బీమా అందుతుండగా ఇందులో సగం కుటుంబాలకు మాత్రమే రాష్ట్ర ఆరోగ్య బీమా పథకం అమలవుతున్నది. ఇతర రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి