కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న చందాన రేవంత్ రెడ్డి నోటి దూల చివరికి తమ కొంపలు ముంచుతుంది అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.సౌమ్యుడు అని పేరున్న మంత్రి లక్ష్మారెడ్డి మీద మొన్న రేవంత్ బూతు పురాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. వినలేని భాషలో రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు కాంగ్రెస్ కు బ్యాక్ ఫైర్ అయ్యాయని కాంగ్రెస్ నేతలు గ్రహించారు.
కాంగ్రెస్ లో చేరిన తరువాత తనకు ఆశించిన రేంజ్ లో పేరు రాకపోవడం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తనని కార్నర్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయడం, రాజీనామా చేయమని తెరాస విసురుతున్న సవాల్ కు తనవద్ద జవాబు లేకపోవడం, స్వంత నియోజకవర్గం కొడంగల్ లో రోజురోజుకూ దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి – వెరసి ఇవన్నీ కలిసి రేవంత్ రెడ్డి అసహనానికి కారణం అవుతున్నాయి.
అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వచ్చిన తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో చర్చనీయాంశం అయ్యింది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ ప్రధాని మోడిని ఉద్దేశించి చేసిన “నీచమైన మనిషి” అనే వ్యాఖ్య కాంగ్రెస్ కు ఎంత హాని చేసిందో వారు గుర్తుచేస్తున్నారు. నష్ట నివారణ కొరకు చివరికి మణి శంకర్ అయ్యర్ ను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాల్సి వచ్చింది.
రేవంత్ ను ఇట్లాగే వదిలేస్తే ఎలెక్షన్ల నాటికి పార్టీని సర్వనాశనం చేస్తాడని కాంగ్రెస్ సీనియర్లు భయపడుతున్నారు. ఈ విషయంపై ఆల్రెడీ రాహుల్ గాంధీకి ఫిర్యాదులు వెళ్లాయట.రేవంత్ కు ముకుతాడు వేయాలని పార్టీలో అత్యధిక నాయకులు అనుకుంటున్నారు. ఇదే విషయం అధిష్టానానికి చెప్పడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు.