Home / TELANGANA / తెలంగాణ కుంభమేళా…మేడారం జాతర తేదీలు ఇవే..!

తెలంగాణ కుంభమేళా…మేడారం జాతర తేదీలు ఇవే..!

తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ…మేడారం జాతరకు రంగం సిద్ధమవుతోంది. 13 వ శతాబ్దంలో తమ జాతి కోసం కత్తి పట్టి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సమ్మక్క, సారలమ్మ శౌర్యపరాక్రమాలకు ప్రతీకగా గిరిజనులు నాలుగు రోజుల పాటు మేడారం జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి..అధికారికంగా నిర్వహిస్తోంది. 2020 వ సంవత్సరం మాఘమాసంలో జరుగబోయే మేడారం జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మేడారం మహా జాతర తేదీలను జాతర పూజారుల సంఘం ప్రకటించింది.

మేడారం జాతర షెడ్యూల్

05.02.2020 న బుధవారంనాడు సారలమ్మ, పగిదిద్దరాజు,గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.
06.02.2020 నాడు గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది.
07.02.2020 శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
08.02.2020 శనివారం నాడు దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు.

అయితే జనవరి 25 నుంచి మేడారం జాతర ఉత్సవాలు మొదలవుతాయి. ప్రధానంగా 5 నుంచి 8 వరకు 4 రోజుల పాటు మేడారం జాతరను ఘనంగా జరుగుతోంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి భక్తులు తరలివస్తారు. ఒక్క గిరిజనులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలు మేడారం జాతరకు విచ్చేసి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకోవడం విశేషం. మేడారం జాతరకు తేదీలు ఖరారు కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.