యువతులపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. భోపాల్‌లో సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతున్న యువతిపై గ్యాంగ్ రేప్ ఉదంతం మరవక ముందే మథురలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన ఓ పర్యాటకురాలిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత పర్యటనకు వచ్చిన రష్యా యువతి (20)తో ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్‌కు పరిచయం ఏర్పడింది. పర్యటనలో సహకారం అందిస్తానని చెప్పి ఆమెతో స్నేహం పెంచుకున్నాడు.
బ్యాంక్ మేనేజర్ మాటలను పూర్తిగా నమ్మిన రష్యా యువతి అతడి పిలుపు మేరకు ఓ చోటకు వెళ్లింది. అతడు ఆమెను వెంటబెట్టుకొని పర్యటన పేరుతో రాజస్థాన్‌లోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు స్థానిక వృందావన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బ్యాంక్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గతంలో ఆగ్రాలో ఇదేవిధంగా స్విర్జలాండ్‌కు చెందిన ఓ జంటపై అఘాయిత్యం జరిగిన విషయం తెలిసిందే. దీనికి సమీప నగరంలో ఇప్పుడు మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకోవడంతో.. ఉత్తరప్రదేశ్ ప్రతిష్టకు కళంకం ఏర్పడే పరిస్థితి తలెత్తింది.