టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రెండు ఘనతల్ని సాధించాడు. ముందుగా ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండొందల ఫోర్ల మార్కును చేరిన తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు సాధించిన కోహ్లి.. ఆ తరువాత ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగుల్ని నమోదు చేసిసన రెండో క్రికెటర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో శనివారం (నవంబర్-5) రెండో టీ20లో కోహ్లి తొలి ఫోర్ ను కొట్టిన తరువాత రెండొందల ఫోర్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ మ్యాచ్ కు ముందు 199 ఫోర్లతో ఉన్న కోహ్లి.. రెండొందల ఫోర్ల మార్కును క్రీజ్ లోకి వచ్చిన కొద్ది వ్యవధిలోనే చేరుకున్నాడు. ఓవరాల్ గా ఈ మార్కును చేరిన మూడో క్రికెటర్ కోహ్లి నిలిచాడు. అంతకుముందు దిల్షాన్ (223), అఫ్ఘనిస్థాన్ కు చెందిన మొహ్మద్ షహజాద్(200) మాత్రమే ఈ ఫార్మాట్ లో రెండొందల ఫోర్లను చేరిన క్రికెటర్లు. మరొకవైపు అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక పరుగుల్ని సాధించిన రెండో క్రికెటర్ గా కోహ్లి నిలిచాడు. ఈ మ్యాచ్ లో 12 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా కోహ్లి ఈ ఫీట్ ను సాధించాడు. తద్వారా దిల్షాన్ (1889)ను కోహ్లి అధిగమించాడు. ఇక్కడ తొలి స్థానంలో బ్రెండన్ మెకల్లమ్(2140) ఉన్నాడు.
ఇదిలా ఉంచితే, కివీస్ విసిరిన 197 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 11పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(1), రోహిత్ శర్మ(5)లు పెవిలియన్ చేరారు. ఆ రెండు వికెట్లను బౌల్ట్ తన ఖాతాలో వేసుకున్నాడు.