దేశంలోనే మొదటిసారిగా నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం మూడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. పేదల కోసం పూర్తి ఉచితంగా, సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన ఇండ్లని నిర్మించి అందజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వారు అభినందించారు.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన ఫ్రొఫెసర్ రాఘవేంద్ర నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పట్టణాభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పన విభాగం ఐఏఎస్ డాక్టర్ వీకే సింగ్, పుదుచ్చేరి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ శ్రీధరణ్‌తో పాటు యూపీ, పుదుచ్చేరి, ముంబై మహానగర పాలక సంస్థకు చెందిన ఇంజినీర్ల బృందం ఐడీహెచ్ కాలనీలోని ఇండ్లను పరిశీలించింది.ఈ సందర్భంగా ఇండ్లు ఎలా ఉన్నాయో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
జీహెచ్‌ఎంసీ హౌసింగ్ విభాగం డిప్యూటీ ఈఈ బీ రఘునందన్ ఉన్నతాధికారుల బృందానికి ప్రాజెక్లు వివరాలను తెలియజేశారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో 396 ఇండ్లను 9 నెలల రికార్డు సమయంలో నిర్మించామన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.7.9 లక్షల చొప్పున, మౌళిక వసతుల కల్పనతో కలిపి రూ.42 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. లబ్ధిదారులందరూ పేద, మధ్యతరగతికి చెందిన వారేనని వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. కాలనీ నిర్మాణ సమయంలో సీఎం కేసీఆర్ నాలుగుసార్లు సందర్శించారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.