కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకువస్తానన్న తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన కేసీఆర్.. ఈరోజు(సోమవారం) కోల్‌కతా చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సెక్రటేరియట్‌కు చేరుకున్న కేసీఆర్‌ను దీదీ సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశం అనంతరం కోల్ కతాలోని కాళీమాత ఆలయాన్ని కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపట్నుంచి రెండు, మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోని మకాం వేయనున్నారు. ఈ నెల 26 లేదా 27న ప్రధాని మోదీని కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తోనూ కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సీఎం కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించనున్నారు.
