కరోనా వైరస్ భయం తో ప్రపంచం వణికి పోతున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ప్రధాన రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బతో పౌల్ట్రీ రంగం పూర్తిగా ధ్వంసం అయింది. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనే భయంతో ప్రజలు వాటిని తినడం పూర్తిగా తినడం మానేశారు. తెలంగాణ రాష్ట్రం లో పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో కేసీఆర్ సర్కార్ రంగంలో కి దిగింది. చికెన్ తో కరోనా రాదు ప్రజలంతా బేషుగ్గా తినొచ్చు అని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున నాన్ వెజ్ ఫెస్టివల్స్ కూడా నిర్వహించింది. అయినా ప్రజల్లో చికెన్, ఎగ్స్ పట్ల భయాందోళనలు తొలగిపోవడం లేదు. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నిన్న కరోనా పై నిర్వహించిన ప్రెస్ మీట్ లో చికెన్, గుడ్ల పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించారు. కరోనా ముప్పు నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరిలో ఇమ్మ్యూనిటి పవర్ ఉండాలని, అందుకోసం బలవర్థక ఆహారమైన చికెన్, గుడ్లు తినాలని బాజాప్తా చెప్పారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మాటంటే గురి. ఆయన మాటకు తిరుగుండదని ప్రజల నమ్మకం. ఇప్పుడు చికెన్, ఎగ్స్ తినొచ్చు అని కేసీఆర్ చెప్పడం తో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు దాదాపుగా తొలగి పోతాయి అనడం లో సందేహం లేదు. అందుకే సీఎం కేసీఆర్ స్పీచ్ విన్న టాలీవుడ్ నిర్మాత, పౌల్ట్రీ ఇండస్ట్రీ అధినేత అయిన బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ ట్వీట్ చేశారు. మొత్తం గా సీఎం కేసీఆర్ మాటలతో తెలంగాణ లో మళ్ళీ చికెన్, ఎగ్స్ అమ్మకాలు ఊపందుకోవడం ఖాయం గా కనిపిస్తుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
