Home / INTERNATIONAL / పారిస్‌ లో మంత్రి కేటీఆర్ Busy Busy

పారిస్‌ లో మంత్రి కేటీఆర్ Busy Busy

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్‌ ఎగువ సభలో (సెనేట్‌) జరిగే ‘యాంబిషన్‌ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా (కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులు, అవకాశాలపై వారికి వివరిస్తారు.

ఫ్రాన్స్‌ ప్రధాని ఇమ్మాన్యూయెల్‌ మాక్రాన్‌ సారథ్యంలో ‘యాంబిషన్‌ ఇండియా-2021’ పేరుతో వాణిజ్య సదస్సు జరుగనున్నది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు ఈ నెల 13న ఆహ్వానం పంపింది. ఈ సదస్సు భారత్‌- ఫ్రాన్స్‌ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొన్నది. ఇలాంటి కీలక వేదికపై తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని వెల్లడించింది.

సదస్సులో వైద్యారోగ్యం, పర్యావరణ మార్పులు, డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌, ఆగ్రో బిజినెస్‌ వంటి ప్రధాన అంశాలపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. గతంలో నిర్వహించిన యాంబిషన్‌ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, ఇరు దేశాల కంపెనీల నుంచి 400కు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సారి అంతకుమించి హాజరవుతారని అంచనా. ఫ్రెంచ్‌ సెనేట్‌లో 348 మంది సభ్యులు ఉన్నారు. ఫ్రాన్స్‌ ఆహ్వానం.. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దకిన గుర్తింపుగా మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. సదస్సు వేదికగా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఇరు దేశాల వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, కంపెనీల ప్రతినిధులకు వివరిస్తానని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ వెంట ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పారిస్‌కు వెళ్లారు.