తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు.
బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని ఈ సందర్భంగా మంత్రి తలసాని మునుగోడు ప్రజలకు సూచించారు. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడున్నరేండ్లలో ఒక్కసారి కూడా గ్రామాలవైపు చూడలేదని వివర్శించారు.
నియోజకవర్గ అభివృద్ధి టీఆర్‌ఎస్ గెలుపుతోనే జరుగుతుందని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు. గ్రామీణ కులవృత్తులకు చేయూతను అందిస్తున్నదని తెలిపారు.