వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది.
యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్ చుక్కలను తాకుతున్నట్లు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లు తెలిపాయి. వ్యవసాయ బోర్లకు కొద్దిరోజులుగా త్రీఫేజ్ కరెంటు 10 గంటలలోపే ఇస్తున్నారు.
శుక్రవారం నుంచి 12 గంటలకు సరఫరా పెంచడంతో డిమాండ్ కూడా పెరుగుతోంది. శనివారం నుంచి 24 గంటలూ త్రీఫేజ్ సరఫరా వ్యవసాయ బోర్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గరిష్ఠ డిమాండ్ 15 వేల మెగావాట్లను దాటిపోవచ్చని డిస్కంల అంచనా.