ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంక్ లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ఆయన ప్రారంభించారు. డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన తరహాలోనే కో-ఆపరేటివ్ రంగం అద్భుతమైన ఫలితాలు సాదించిందన్నారు.అంతకు ముందు కరీంనగర్ జిల్లా ములక నూరు లాంటి సహకార సంఘాలు వేళ్ళ మీద లెక్కించేవి గా ఉన్నాయన్నారు.తదనంతర కాలంలో రైతాంగాంలో గణనీయమైన మార్పులు సంబవించడంతో వ్యవసాయ రంగానికి సహాకర రంగం సేవలు కీలకంగా మరాయన్నారు.
అందులో ముఖ్యంగా రైతాంగానికి సేవలు అందించడంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ల పనితీరు భేషుగ్గా ఉన్నదని ఆయన కితాబిచ్చారు.విత్తనాలు,ఎరువుల విక్రయాల తో పాటు ధాన్యం కొనుగోళ్లలో సహకార సంఘాల పాత్ర అద్భుతమైన సేవలు అందిస్తున్నదన్నారు.అయితే అదే సమయంలో సహకార సంఘాలు ఇతర ఆహార ఉత్పత్తుల అమ్మకాలు,కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. యావత్ రైతాంగం సహకార సంఘాలలో విధిగా సభ్యత్వం పొంది ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహాకార సంఘలా అభివృద్ధిలో డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గా ఉన్న గొంగిడి మహేందర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్నారు.సహాకార రంగంలో ఆయన గడించిన అనుభవం తోడైందని ఆయన ప్రశంశించారు.