సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత గవర్నర్ హరీశ్ రావుతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కేటీఆర్ తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ తో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. కేబినెట్ లో ఇప్పటికే 12 మంది మంత్రులుండగా..తాజాగా ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 18కు చేరింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కేటీఆర్, హరీష్‌రావులు మళ్లీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
