Home / SLIDER / కల్పతరువు హైదరాబాద్‌

కల్పతరువు హైదరాబాద్‌

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం కల్పతరువు వంటిదని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్‌ డివిజన్‌లో రూ.263.09 కోట్ల వ్యయంతో 3.3 కిలోమీటర్ల పొడవున నిర్మించిన కొత్తగూడ మల్టీ లెవెల్‌ ఫ్లైఓవర్‌ను ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. గత ఏడాది కొత్త సంవత్సరం మొదటి రోజున షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించుకొన్నామని, ఈ ఏడాది కొత్త సంవత్సరం మొదటి రోజున కొండాపూర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నదని తెలిపారు.

అభివృద్ధిలో రహదారులే కాకుండా తాగునీరు, కరెంట్‌, డ్రైనేజీల నిర్మాణం వంటి మౌలిక వసతులను నగర అవసరాలకు సరిపడే విధంగా చేపడుతున్నామని వెల్లడించారు. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా 34వ ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు. కరోనా తర్వాత ఇతర దేశాలు, నగరాల నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ఎంతో మంది ఇక్కడ చోటుచేసుకొన్న మార్పులను సోషల్‌ మీడియా ద్వారా కొనియాడుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నప్పటికీ, చేసిన పనులను ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు.

మరో 50 ఏండ్లకు సరిపడా వసతులు
——————————————–
సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువు వంటి హైదరాబాద్‌ నగరాన్ని అన్ని విధాలుగా రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. విద్య, ఉపాధి వంటి అన్ని అవకాశాలు అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు నగరానికి వలస వస్తున్నారని, వీరందరికీ రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా మంచినీటి వసతిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాళేశ్వరం, కృష్ణా నది నుంచి మంచినీటి తరలిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే కరెంట్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఎస్‌ఆర్‌డీపీలో రూ.8 వేల కోట్లతో 34 పనులను ఇప్పటికే పూర్తి చేశామని, 2023లో మరో 11 పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.

2020 అక్టోబర్‌లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ద్వారా రూ.1,000 కోట్లతో హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల 8 మున్సిపల్‌ కార్పొరేషన్లను కలిపి నాలాల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులు వచ్చే మార్చి -ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే మే నాటికి దేశంలోని మహానగరాల్లో హైదరాబాద్‌ 100 శాతం సీవరేజీ సాధించి ప్రథమ స్థానంలో నిలుస్తుందని వెల్లడించారు. 100 శాతం సీవరేజీ సాధించే లక్ష్యంతో మురుగునీటి శుద్ధికి రూ.3,866 కోట్లతో 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వివరించారు.

సాఫీగా ప్రజా రవాణా
——————————
హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే నగరంలో మెట్రో 70 కిలోమీటర్లు పూర్తి చేసుకోగా, తాజాగా శంషాబాద్‌ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ నిర్మించనున్న మెట్రో లైన్‌కు ఇటీవల సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. రానున్న మూడేండ్లలో మెట్రో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు.

రాబోయే నాలుగేండ్లలో రాష్ట్రంలో 3 వేలకు పైచిలుకు ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి, కాలుష్య రహిత ప్రజా రవాణాను అందించేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు. ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వసతులను కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచి విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, నారాయణరెడ్డి, ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat