జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులతో పాటు జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ డి.రాజేశ్వర్, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, బీ.సీ సంక్షేమ శాఖ అధికారులు రమేష్, నర్సయ్య, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ఎంతో హర్షణీయం అని వక్తలు అన్నారు. విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సంఘ ప్రతినిధులు తెలిపారు. కాగా, వచ్చే సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో ఘనంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.