తెలంగాణలో ఇటీవల టీఎస్పీఎస్సీ 783 పోస్టులతో విడుదల చేసిన గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్-2 రెండో సెక్షన్లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు.
జాతీయ సమగ్రత, అంతర్గత భద్రత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలు చేర్చారు. మూడో సెక్షన్లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం-మహిళలు అనే అంశాన్ని చేర్చారు. పేపర్-3లోని ఒకటో సెక్షన్లో డెమోగ్రఫీ(జనాభా శాస్త్రం), ప్రాథమిక, ద్వితీయ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం, ప్లానింగ్, నీతిఆయోగ్-పబ్లిక్ ఫైనాన్స్ జతచేశారు. రెండో సెక్షన్లో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధితోపాటు జనాభా-మానవవనరుల అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాలు, పరిశ్రమలు-సేవా రంగాలు, రాష్ట్ర ఫైనాన్స్, బడ్జెట్, పాలసీలు చేర్చారు. మూడో సెక్షన్లో అభివృద్ధి-అండర్ డెవలప్మెంట్, పేదరికం-నిరుద్యోగిత, పర్యావరణం- సుస్థిర అభివృద్ధిని కొత్తగా కలిపారు.