జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్పందించారు. ఎన్నో ఏళ్లుగా దేశసమగ్రతకు సవాలుగా నిలిచిన ఆర్టికల్ 370 ని రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని స్వామిజీ అభిప్రాయపడ్డారు. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీ, అమిత్ షా అభినందనీయులు అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం దేశ సమగ్రతకు, సమైక్యతకు దోహదపడుతుందని, ఈ నిర్ణయంతో జమ్ముకాశ్మీర్ ప్రజల సమగ్ర వికాసం సాకారమవుతుందని స్వామి స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల దేశంలోని శక్తి పీఠాలన్నింటినీ సందర్శించే అవకాశం ఇన్నేళ్ళకు దక్కుతోందని హర్షం వ్యక్తం చేశారు. కాశ్మీర్ లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు ఈ ఆర్టికల్ 370 రద్దు ఉపయోగపడుతుందని, భారత సర్కారు సరస్వతీ శక్తిపీఠం పునరుద్ధరణకు పూనుకుంటే శారదా పీఠం సహకరిస్తుందని స్వామిజీ తెలిపారు. – రామ జన్మభూమి, గోరక్షణ విషయాల్లోనూ ఇదే తరహాలో తక్షణ చర్యలు చేపట్టాలని, భారత దేశపు అధికారిక ఆధ్యాత్మిక చిహ్నంగా గోవును ప్రకటించాలని , ఈ చర్యలు చేపడితే మోడీని అభినవ వివేకానందుడిగా హిందువులంతా కీర్తిస్తారని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు. గత నెల 5 వ తేదీ నుంచి విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామిజీ బుుషికేష్‌లో చాతుర్మాస్య దీక్ష పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆర్టికల్ 370 రద్దుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ స్వామిజీ స్వాగతించడం గమనార్హం.
