తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈ క్రమంలో నిన్న శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ప్రగతి భవన్ లో సమావేశమైన సంగతి విదితమే.. ఈ సందర్భంగా 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ గా, మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం 17 సెప్టెంబర్, 2022 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్నది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ మూడు రోజులపాటు (16, 17, 18 సెప్టెంబర్, 2022) రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.
అంతేకాకుండా రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రస్థుతం అందచేస్తున్న 100 మందితో పాటు ప్రతి నియోజకవర్గానికి మరో 500 మందికి దళిత బంధు పథకాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.