బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయో చూపాలని డిమాండ్ చేశారు.రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయదారుల నడ్డి విరిచేలా విధానాలను రూపొందిస్తున్నదని చెప్పారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతున్నదని చెప్పారు.కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు ఉమ్మడి జిల్లాలోని తొర్రూరు, పెద్దవంగర, పాలకుర్తి మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అదేవిధంగా పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందించడంతోపాటు పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన, బోనాల పండుగల పాల్గొననున్నారు.