తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రస్తుతం మహా గణపతిని భారీ క్రేన్ సహాయంతో ట్రాలీ పైకి ఎక్కిస్తున్నారు. అనంతరం వెల్డింగ్ పూర్తిచేసి.. నిమజ్జన శోభాయాత్ర ప్రారంభంకానుంది.
ఈనేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. నిమజ్జనం శనివారం ఉదయం వరకు వినాయకుల నిమజ్జనం ముగుస్తుందని చెప్పారు.