తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయి. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి గొర్రెలకు, పశువులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై కార్యాచరణ రూపొందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం అన్నారు.65 ఏండ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో జరిగింది.దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్లోరిన్ సమస్య ఎందుకు పరిష్కరించలేదు. 24 గంటలు విద్యుత్ ఇస్తామంటే ఎవరన్న వద్దన్నారా?.మీరు మీ అభివృద్ధి కోసం పని చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని స్పష్టం చేశారు.