అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన ప్రతిపక్ష సభ్యులు లాబీల్లో టైమ్‌పాస్ చేస్తున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం అసెంబ్లీ జరిగేటప్పుడైనా ప్రతిపక్షం తమ పాత్ర సరిగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలకు సభలో కనీసం 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదని ఎద్దేవా చేశారు.
ఎస్సార్డీపీపై ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చే సమయంలో కాం గ్రెస్, బీజేపీకి చెందిన ఒక్కొక్క సభ్యుడు మాత్రమే సభలో ఉన్నారు. దీంతో ఆయన ప్రతిపక్షాల వైఖరిని తూర్పారబట్టారు ‘అసెంబ్లీకి ముందు ఓ బీజేపీ ఎమ్మెల్యే 30 రోజులు సభ నిర్వహించాలని లేఖ రాస్తారు. బీఏసీ మీటింగ్‌లో 20 రోజులు సభ నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు.
కానీ, సభ జరిగేటప్పుడు మాత్రం ఎవ్వరూ సభలో ఉండరు. ఇదీ వీళ్లకు ప్రజల మీద, వారి సమస్యలపై ఉన్న చిత్తశుద్ధి. వీళ్లా ప్రజల సమస్యలపై పోరాడేది? అంతా కప ట ప్రేమ, నాటకం. అంతా ప్రజలు చూస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట పెద్ద డైలాగ్‌లు కొట్టడం కాదు.. ప్రభుత్వం సమాధానం చెప్తున్నప్పుడు వినే ఓపిక కూడా ఉండాలని చురకలంటించారు. సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ఉండకుండా చూడాలని స్పీకర్‌ను కోరారు. ‘లేటుగా వచ్చినా.. లేటెస్టుగా వచ్చా..’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పడంతో.. వెంటనే ‘అసెంబ్లీకి వచ్చినందుకు ధన్యవాదాలు’ అని కేటీఆర్ అనడంతో సభంతా నవ్వులు పూసింది.