తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3,23,396 మందికి ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షలకుపైగా ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాలు సృష్టించినట్టు మంత్రి కేటీఆర్ అసెంబ్లీసాక్షిగా వెల్లడించారు.
ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నిలదొక్కుకోవడంతో ఎకరం రూ.వంద కోట్లు పలికే పరిస్థితులు వచ్చాయని చెప్పారు.
తెలంగాణలో స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్‌షీప్ ఉన్నందునే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. హర్యానాలోని గొప్ప ఐటీ సెంటర్ గుర్గావ్‌ను కులమతాల పేరుతో గబ్బురేపుతున్నారని, మణిపూర్‌లో మతాల మంటలు చల్లారలేదని, దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు ఉండటం వల్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదని పేర్కొన్నారు. దేశంలో ఐటీ పురోగతి కంటే రాష్ట్రంలో ఐటీ పురోగతి నాలుగు రెట్లు అధికంగా ఉన్నదని, దానికి ఏబుల్ లీడర్‌షిప్ ప్రధాన కారణమని వివరించారు.