జమ్ముకాశ్మీర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు కాశ్మీర్‌లోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్దరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. కాగా, నిన్న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృఢ వైఖరితో ఉందన్నారు. ఆ దిశగానే. ముందుకు సాగుతుందన్నారు. అందులో భాగంగానే. భారత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా దినేశ్వర్ శర్మను నియమిస్తున్నాం.. కాశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలు, సంస్థలతో ఆయన చర్చలు కొనసాగిస్తారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తి చర్చల్లో పాల్గొనడం పెద్ద అనుకూల అంశం అన్నారు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.
