జన్‌ధన్ ఖాతా తెరిస్తే అలవోకగా ఖాతాల్లో నగదు బోనస్ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 31% మంది జనం ఆశించినట్లు ప్రపంచబ్యాంకు అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో రాష్ట్రవాసులు బిహార్ తర్వాతి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 13% మంది ఇలాంటి ఆశలు పెట్టుకోగా ఆంధ్రప్రదేశ్(31%), బిహార్(46%) వాసుల అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వం జన్‌ధన్ పథకం మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత 2016 జనవరి-మార్చి మధ్యలో ప్రపంచబ్యాంకు బృందం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 12 రాష్ట్రాల్లో 12వేల మందిని సర్వేచేసింది. కొందరు ఖాతా తెరిచిన వెంటనే బోనస్ పడుతుందని భావిస్తే, మరికొందరు దీనిద్వారా లభించే ఓవర్‌డ్రాఫ్ట్‌ను వెనక్కు ఇవ్వనవసరంలేదని భావించారు. ఇంకొందరు విదేశాల నుంచి వెలికితీసే నల్లధనాన్ని ప్రభుత్వం తమ ఖాతాల్లో వేస్తుందని ఆశించారు. ఇలాంటి అంచనాలతోనే చాలామంది ఖాతాలు తెరిచినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఖాతాదారులకు రూ.5వేల ఓవర్‌డ్రాఫ్ట్(ఓడీ) ఇస్తారన్న ఉద్దేశంతోనే ఖాతా తెరిచినట్లు మహారాష్ట్రలో 25% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం ప్రబలడంతో కొన్ని బ్యాంకులు ఓడీ పరిధిని తగ్గించినట్లు అధ్యయన బృందం పేర్కొంది. ఇంకొందరు ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల కింద సబ్సిడీ మొత్తాలను వేసినట్లుగానే ఓవర్‌డ్రాఫ్ట్ మొత్తాన్ని కూడా వేస్తారని వూహించారు. రాజస్థాన్, హరియాణ, బిహార్‌ల్లో అనేకమంది తమ ఖాతాల్లోకి ప్రభుత్వం విదేశాల నుంచి వెలికితీసే నల్లధనాన్ని వేస్తుందని ఆశించారు. ఇలా వూహించిన మొత్తం రూ.5వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉన్నట్లు సర్వేలోతేలింది. జన్‌ధన్ యోజన గురించి విస్తృతస్థాయిలో తప్పుడు అంచనాలు ప్రబలినట్లు ప్రపంచబ్యాంకు బృందం వెల్లడించింది. జన్‌ధన్ యోజన ఉద్దేశాల గురించి స్పష్టమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉన్నట్లు పేర్కొంది.
