48 రోజులుగా భక్తుల పూజలందుకున్న అత్తి వరదరాజస్వామి తిరిగి అనంత పుష్కరిణిలోకి చేరుకున్నారు. తమిళనాడులోని కంచి వరదరాజస్వామి ప్రతి 40 ఏళ్లకు ఒకసారి పుష్కరిణిలోంచి బయటకు వచ్చి 48 రోజుల పాటు భక్తులకు దర‌్శనం ఇచ్చి…తిరిగిపుష్కరణికి చేరుకుంటారు. శనివారం రాత్రి 12గంటలకు స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్ఛకులు ప్రత్యేక పూజలతో నిర్వహించారు. దీంతో 48రోజుల పాటు జరిగిన అత్తివరదస్వామి ఉత్సవాలు అంత్యంత వైభవంగా ముగిశాయి. ఇక తిరిగి మరో 40 ఏళ్ల తర్వాత అంటే 2059లో శ్రీ అత్తివరదరాజ స్వామివారు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. తమిళుల ఆరాధ్యదైవంగా… కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కాంచీపురంలో అత్తివరదస్వామి కొలువై ఉన్నాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన అత్తివరదరాజస్వామి 1979లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి ఈ ఏడాది జులై 1న పుష్కరిణి నుంచి బయటకు వచ్చిన వరదరాజ స్వామి.. 31 రోజుల పాటు శయన అవతారంలో దర్శనమిచ్చి, ఆగస్టు 1 నుంచి నిలబడిన అవతారంలో దర్శనమిచ్చారు. గత 48 రోజులుగా ఉదయం, సాయంత్రం రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరిగింది. ఉదయం 6 గం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు దర్శించుకున్నారు.40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే అత్తివరద స్వామిని ప్రతి రోజు ఐదు లక్షల మంది భక్తులు సరాసరిన దర్శించుకున్నట్టు సమాచారం. ఇక తెలంగాణ సిఎం కేసిఆర్ సైతం స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తంగా 48 రోజులుగా భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజస్వామి మళ్లీ పుష్కరిణిలోకి ప్రవేశించారు. మళ్లీ 2059లో భక్తులకు స్వామివారి దర్శనం కలుగనుంది.