భోగి పండుగ గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్నిపొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది పురాణాలు తెలియజేస్తున్నాయి.శ్రీమహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట.
బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. ఈ భోగి రోజు నాడే శ్రీ కృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతం ఎత్తాడని భాగవతం తెలుపుతుంది. అలాగే ఈ భోగి పండుగ రోజు పరమేశ్వరుని వాహనమయిన బసవన్న భువికి దిగి వచ్చాడని మరో పురాణ గాథ మనకు తెలియజేస్తుంది. భోగినాడు కొత్త బియ్యతో చేసిన పులగం తినటం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసర పప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం రుచికే గాక పోషకాల పరంగానూ ఎంతో మేలైనది. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపించే ఈ పులగాన్ని భోగినాడు తప్పక తినాలని పెద్దలు చెబుతారు. భోగినాడు సాయంత్రం చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను క్రమపద్ధతిలో ప్రదర్శనగా ఉంచి పూజిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేవతల పాటలు పాడి వారి ఆశీస్సులు కోరుకుంటారు.