కరోనా దెబ్బకు ఇప్పటివరకూ రెండ్రోజులు కూడా మూయని ఓ తెలుగు దిన పత్రికకు ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బెటరని పత్రికా సిబ్బంది కూడా యాజమాన్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గతంలో వార్తలు తెలుసుకునేందుకు ప్రజలు కేవలం పత్రికలపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియా విస్తృతి పెరిగింది . దాంతో వార్త విశేషాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునే వెసులుబాటు లభించింది. ఏదైనా ఒక సంఘటన గురించి సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే ప్రజలు పత్రికలపై ఆధారపడుతున్నారు
ఈ నేపధ్యంలో కరోనా వంటి ప్రాణాంతక వైరస్ విస్తృతిని అడ్డుకునేందుకు ఆంధ్రభూమి తెలుగు దినపత్రిక యాజమాన్యం వారం రోజులపాటు సెలవు ప్రకటించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మరికొన్ని పత్రికలు నేడో, రేపో సెలవులు ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆంగ్ల దినపత్రికలు హోమ్ టూ వర్క్ పద్దతిలో పని చేయాలని తమ సిబ్బందిని ఆదేశించాయి. కరోనా కట్టడికి పత్రికల యాజమాన్యాలు కూడా అదే పద్దతిలో పని చేయించుకుంటే మంచిదన్న సలహా ప్రభుత్వం చేస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఆఫీస్ కే వచ్చి పని చేయాలన్న వితండవాదాన్ని పత్రికల యాజమాన్యాలు వీడనాడితే మంచిదని జర్నలిస్ట్ కమ్యూనిటీ నుంచి సూచనలు వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో జర్నలిస్టుల ప్రాణాలతో చెలగాటమాడినట్లు అవుతుందని సదరు ఉద్యోగులు అంటున్నారు.