Fees Reimbursement :విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ, 15,600 కోట్లు అందించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద 26,98,728 మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 11, 317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8, 44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.
విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని సీఎం పేర్కొన్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ, 15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని. బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు. పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు.
సీఎం జగన్ ప్రసంగం.. ఆయన మాటల్లోనే!
►ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్‌లో ఇంకా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం.
►ప్రతి అడుగూ కూడా ప్రతి పిల్లాడినీ చేయి పట్టుకొని పెద్ద చదువులు చదివించి తద్వారా పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నాం.
► 17-20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బతకాలంటే వాళ్ల ప్రయాణాన్ని జీవిత ప్రమాణాన్ని ఈ రెంటింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని నమ్మాం.
►పిల్లల చదువుల కోసం వేగంగా అడుగులు వేస్తున్నాం.