నాగరిక సమాజానికి దూరంగా ఉండే మన్యం ప్రాంతాల్లో.. రవాణా సౌకర్యానికి కూడా నోచుకోని మారుమూల తండాల్లో ప్రసవ వేదన పడుతున్న గర్భిణులను మంచాలపై మోసుకురావడం గురించి విని ఉంటాం. అనారోగ్యంతో మంచం పట్టిన గిరిజనుల్ని కావడి కట్టుకొని ఆస్పత్రికి తరలించడం చూసి ఉంటాం. కానీ పట్టణ ప్రాంతాల్లో సైతం నేటికీ ఇలాంటి అవస్థలు తప్పడం లేదనడానికి నిదర్శనమే ఈ చిత్రం. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారులో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి నిండు గర్భిణి. బుధవారం పురిటి నొప్పులు ప్రారంభమవడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమీప బంధువులు సిద్ధమయ్యారు.
108 కు ఫోన్ చేస్తే వైద్యశాలకు ఉచితంగా చేర్చుతుందనే విషయం కూడా తెలియని ఆ అమాయకులు లక్ష్మీదేవిని బల్ల రిక్షాపై కూర్చోబెట్టి వైద్యశాలకు బయలుదేరారు. ప్రభుత్వాస్పత్రి వరకు రిక్షాపై తీసుకెళ్ల లేక సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఒక వైపు పురిటి నొప్పులు.. ఇంకోవైపు గుంతల మయమైన రోడ్ల పై రిక్షా కుదుపులకు ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
మరో ప్రాణికి ఊపిరి పోసి ఈ ప్రపంచాన్ని చూపబోతున్న ఆమె పంటి బిగువున నొప్పిని భరిస్తూ ఎలాగో ఆస్పత్రికి చేరింది. ప్రభుత్వ పథకాలపై అవగాహన లేని నిరక్షరాస్యులైన నిరుపేదలు వేలకు వేలు అప్పులు చేసి మరీ వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు గర్భిణుల వివరాలను పొందుపరచాలి. ప్రసవ సమయానికి వైద్య సేవలతో పాటుగా పౌష్టికాహారంపై సూచనలివ్వాలి. కానీ, అధికార యంత్రాంగం ఆ దిశగా అవగాహన కల్పించకపోవడం శోచనీయం.