తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కొత్త ప్రతిపాదన తెచ్చినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో సహా అనేక మంది ఒకేసారి తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన నేపథ్యంలో.. మిగిలిన వారిలో స్థైర్యం నింపడానికి పార్టీ అధినేత తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెబుతూ బాబు వారిలో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ ఉనికి నిలవాలంటే కొన్ని మార్పులు చేయాలని తమ్ముళ్లు బాబుకు సూచించినట్టుగా సమాచారం.
ప్రత్యేకించి తెలంగాణలో టీడీపీకి ఒక ఛరిష్మాటిక్ లీడర్ అవసరమని వారు బాబుకు విన్నవించారట. చంద్రబాబు అవతల ఏపీకి సీఎంగా ఉన్నారు. ఇక లోకేష్ బాబు కూడా ఏపీలోనే మంత్రిగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిని వారిద్దరూ ఎంతగా సమీక్షించినా.. ఆంధ్రప్రదేశ్ నేతలుగానే ఉంటారు. అందుకే తెలంగాణకంటూ ఒక పూర్తి స్థాయి నేత అవసరమని బాబుకు వారు విన్నవించారట. ఆ బాధ్యతను చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి తీసుకుంటే బాగుంటుందని తెలంగాణ టీడీపీ నేతలు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే బ్రహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కొంతమంది ఏపీ టీడీపీ నేతలు కోరారు. అందుకు తగ్గట్టుగా ఆమె వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ నుంచి లేదా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయవచ్చనే మాట వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు కూడా బ్రహ్మణికి బాధ్యతలు ఇవ్వాలని బాబును కోరుతుండటం గమనార్హం. మరి వీరి విన్నపం పట్ల బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.