దేశవ్యాప్తంగా2018-19 విద్యా సంవత్సరానికికు పైగా ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు త్వరలో మూతబడనున్నాయి. 2018-19 విద్యా సంవత్సరానికి గానూ.. ఈ కళాశాలలు ఎలాంటి అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టవద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సూచించినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా సదరు కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మానవ వనరుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గత ఐదేళ్లుగా దాదాపు 300 కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య 30శాతం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఆయా కళాశాలను వచ్చే ఏడాది కొత్త ప్రవేశాలు చేపట్టొద్దని సూచించినట్లు సదరు అధికారి వెల్లడించారు.ఈ కాలేజీలకు సైన్స్ కళాశాలలు లేదా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌గా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక.. ప్రవేశాలు తక్కువగా ఉన్న మరో 500 ఇంజినీరింగ్ కాలేజీలపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వెబ్‌సైట్ డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 3000 ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.వీటిల్లో 800 కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య 50శాతం కంటే తక్కువగానే ఉంది. 150 కళాశాలల్లో అయితే 20శాతం కూడా విద్యార్థులు చేరలేదు. దీంతో అతి తక్కువ ప్రవేశాలు ఉన్న 300 కళాశాలలను మూసివేయాలని సూచించినట్లు అధికార వర్గాల సమాచారం.
