దేశరాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాసేపటి క్రితమే టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఎంపీల ప్రసంగం ముగిసింది. దీంతో మిగిలిన పార్టీల ఎంపీలు ప్రస్తుతం సభలో మాట్లాడుతున్నారు. పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా.. ప్రతీ పార్టీ వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసల వరర్షం కురిపించే వారు కొందరైతే.. విమర్శించే వారు మరికొందరు. ఇలా ప్రశంసలు.. విమర్శలతో పార్లమెంట్ సమావేశాలు హీటెక్కాయి.
ఇదిలా ఉండగా, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ పార్లమెంట్ సమావేశం ముగియగానే తన పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బాటలో మరో ముగ్గురు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఒకరు ఎస్పీ వైరెడ్డి కాగా, మరో ఇద్దరి పేర్లు తెరపైకి రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఎస్పీ వై రెడ్డి తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోనున్నారని కొందరు అంచనా వేస్తుండగా.. మరికొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొంటున్నారు.