హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున సోదర, సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు.రాఖీ పండుగను ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్షా అంటే రక్షణ అని, బంధన్ అంటే బంధం అని అర్థం.ఈ సంవత్సరం మొత్తం సోదరుడికి విజయం, శాంతి, మంచి ఆరోగ్యంచేకూరాలని ఆశిస్తూ అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీని కడుతారు.రాఖీ కట్టిన సోదరికి ఏ సమస్యలు రాకుండా, జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు భావించే పండుగగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం.సోదరి రాఖీ కట్టి సోదరుడికి స్వీట్స్ తినిపిస్తుంది.రాఖీ పర్వదినం సందర్బంగా రాఖీలతోపాటుస్వీట్స్‌కు కూడా గిరాకీ ఉంటుంది.కేరళ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో ” ఆవని ఆవిట్టం”, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో” కజరి పూర్ణిమ””గా రక్షాబంధన్‌ని జరుపుకుంటారు.గోవా, కర్నాటక, గుజరాత్, మహారాష్ట్రాల్లో ఈ రాఖీ పండుగతోనే కొత్త బుుతువు ప్రారంభమైనట్లు భావిస్తారు.రాక్షసులపై విజయం సాధించాలని కోరుతూ..శుచీదేవి పూజించిన ఒక దారాన్ని తన భర్త ఇంద్రుడికి కడుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇతిహాసాల్లో చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం రక్షా బంధన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.భారతదేశంపై దండయాత్ర చేసిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భార్య రుక్సానా భారతీయ రాజు పురుషోత్తముడిని తన అన్నలా భావించి రక్షాబంధన్ కట్టిందని చరిత్ర చెబుతుంది.1905లో బెంగాల్ విభజన సందర్భంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన పిలుపు మేరకు హిందూ, ముస్లింల ఐక్యతను చాటేలా అనేక మంది ముస్లిం స్త్రీలు సోదర హిందువులకు రక్షా బంధనం కట్టినట్లు తెలుస్తోంది.సోదరీ, సోదరుల మధ్య అవ్యాజమైన ప్రేమను చాటే ఈ రాఖీ పర్వదినాన్ని ఒక్క ఇండియాలోనే కాకుండా బ్రిటన్, నేపాల్, కెనడా తదితర దేశాల్లో రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్‌లో సాధారణ రాఖీలు రూ.5 నుంచి రూ. 60 వరకు లభిస్తుండగా, ముత్యాలు, రాళ్లు పొదిగిన రాఖీలు మాత్రం రూ.100 నుంచి రూ.1000 వరకు
పలుకుతున్నాయి. ప్రతి మహిళను సోదరిలా భావించాలని, ఓ సోదరుడిలా ఆమెకు రక్షగా ఉండాలనే సందేశాన్ని ఇస్తున్నపర్వదినం….రక్షాబంధన్.
Tags brothers festival India Raksha Bandhan sisters World