ఏంటీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా…పట్టపగలు అమ్మవారి ఆలయంలో పూజారే దొంగతనం చేయించడం ఏంటని అనుకుంటున్నారా…అవును..ఇది నిజం..ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలలోని ఓ ఆలయంలో కొందరు పట్టపగలే దొంగతనం చేసి అక్కడ నుంచి మళ్లీ వెనుదిరిగి చూడకుండా పారిపోతారు. అక్కడ ఉన్న పూజారీ, పోలీసులు కూడా దొంగతనం చేసి పారిపోయే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించరు. స్థానిక చూడామణి ఆలయంలో ప్రతి రోజూ జరిగే తంతు ఇది. కొందరు భక్తులు రావడం ఆలయంలో దొంగతనం చేసి వెనుదిరగకుండా పారిపోవడం..ఏంటీ ఈ వింత అనుకుంటున్నారా..ఇది చూడామణి ఆలయంలో అనాదిగా పాటిస్తున్న ఆచారం. ఈ చూడామణి ఆలయం ఉత్తరాఖండ్‌లోనే అతి పురాతనమైనది. ఈ ఆలయానికి సంతాన ఆలయం అని కూడా పేరు. పిల్లలు లేని దంపతులు ఈ ఆలయాన్ని సందర్శిస్తే అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పెళ్లైన తర్వాత చాలాకాలంగా పిల్లలు లేని దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ చూడామణి ఆలయానికి వచ్చే దంపతులు పట్టపగలే దొంగతనం చేయాలన్నది ఇక్కడి ఆచారం. దొంగతనం అంటే ఏ హుండీలోని నగదో, అమ్మవారి నగలో కాదు.. అమ్మవారి పాదాల మీద ఉన్న ఓ చెక్క బొమ్మను దొంగిలించాలి. ఎవరైతే ఆ చెక్క బొమ్మను దొంగిలిస్తారో..వారికి పండంటి బిడ్డ పుడతుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ దొంగతనంలో మరో ట్విస్ట్ ఏంటంటే..అమ్మవారి పాదాల ముందు ఉన్న చెక్కబొమ్మను దొంగిలించి తీసుకువెళ్లిన వారు..పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ ఈ ఆలయానికి వచ్చి.. ఆ చెక్క బొమ్మను అమ్మవారి పాదాల ముందు యధాస్థానంలో ఉంచాలి.
ఈ వింత ఆచారం వెనుక ఓ పురాణ గాథ ఉందని అక్కడి స్థానికులు చెబుతారు. పూర్వం ఈ చూడియాల ప్రాంతాన్ని లాందౌరా రాజు పాలిస్తుంటాడు. ఆయనకు వారసులు లేరు. సంతానం కోసం రాజదంపతులు పరితపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒకసారి వేట నిమిత్తం అడవిలో ప్రయాణిస్తున్నప్పుడ రాజుకు ఈ చూడామణి ఆలయం కనిపిస్తుంది. వెంటనే ఆయన . ఆలయం వద్దకు వెళ్లి తనకు సంతాన ప్రాప్తి ప్రసాదించమని చూడామణి అమ్మవారిని వేడుకుంటాడు. రాజు బాధకు చలించిపోయిన అమ్మవారు..వెంటనే చెక్క రూపంలో దర్శనమిస్తుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజు ఆ చెక్క బొమ్మను తన వెంట తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మవారి మహిమతో లాందౌరా రాజు భార్య పండింటి మగ బిడ్డకు జన్మనిస్తుంది. దీంతో పరమానందభరితుడైన రాజు సతీసమేతంగా ఆలయానికి వచ్చి తిరిగి అమ్మవారి పాదాల ముందు చెక్కబొమ్మను ఉంచుతాడు. అప్పటి నుంచి ఈ చూడామణి ఆలయంలో పిల్లలు లేని దంపతులు అమ్మవారి పాదాల ముందు ఉన్న చెక్కబొమ్మను దొంగిలించే సంప్రదాయం మొదలైంది..ఇప్పటికీ స్థానిక ప్రజలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ఈ ఆలయ పూజారులు అంటున్నారు. పిల్లలు లేని దంపతులు అమ్మవారి పాదాల ముందు చెక్కబొమ్మను దొంగిలించేలా పూజారి ప్రోత్సహించడం గమనార్హం. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే.. డెహ్రడూన్‌కు వెళ్లాల్సిందే.. ఇదీ చూడామణి ఆలయంలో పట్టపగలే దొంగతనం చేసే వింత ఆచారం వెనుక ఉన్న కథ.