చాలా మంది ఏమడుగుతున్నారంటే, మనుషులను చంపితే శిక్షలు వేయరుగానీ కృష్ణజింక ను వేటాడి చంపినందుకు శిక్ష వేయడం ఏంటని. సల్మాన్ భాయ్ అభిమానులు మాత్రమే కాదు ఈ దేశంలో న్యాయవ్యవస్థ రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మ అనుకునే వారందరూ ఇదే అంటూన్నారు. కానీ నిజం ఏమిటంటే సల్మాన్ కి శిక్ష పడటం వెనుక ఒక విలక్షణమైన రాజస్థానీ తెగ పోరాటం ఉంది. ఆ తెగ పేరు బిష్ణోయ్.
ఈ తెగవారందరూ ఒక మతాన్ని అనుసరిస్తారు. బిష్ణోయ్ మతం. జంబేష్వరుడనే గురువు పదిహేనో శతాబ్దంలో స్థాపించిన మతం. అతడిని విష్ణువు అవతారంగా వాళ్ళు భావిస్తారు. అతడు చెప్పిన ఇరవై తొమ్మిది సూత్రాలే వారి మతానికి మూలం. బీష్ అంటే ఇరవై. నౌయ్ అంటే తొమ్మిది. అందుకే బిష్ణోయ్. ఈ సూత్రాలు అన్నీ ప్రకృతి పరిరక్షణకూ, జీవకారుణ్యానికీ సంబంధించినవే. వీరు భక్త ప్రహ్లాదుడిని కూడా కొలుస్తారు. ప్రపంచంలో ఏ ఆర్గనైజ్డ్ మతానికి లేని విలక్షణత ఈ తెగ వారు అనుసరించే మతానికి ఉంది. ప్రకృతిని కాపాడటమే ఈ మతానుయాయుల విధి. వారి ఆచారం. అదే వారి జీవన విధానం. ప్రకృతిలోని ప్రతీ పశు పక్షాదులనూ కంటికి రెప్పలా గా కాపాడటం కోసమే వారు జీవిస్తారు. చెట్లను కూడా వారు నరకనీయరు. నీలి రంగు దుస్తులకు అద్దే నీలాన్ని చెట్ల నుండి తీయాల్సి ఉంటుంది కనుక వీళ్ళు నీలి రంగు దుస్తులను కూడా ధరించరు. పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో జోథ్పురు రాజు అభయ్ సింగ్ తన కోట గుమ్మటాల కోసం చెట్ల దుంగలను నరికి తెమ్మని తన సైన్యాన్ని పంపాడట. అప్పటి ఈ తెగ నాయకురాలైన అమృతా దేవి అనే మహిళ సైనికులను చెట్లు నరకనీయకుండా ఉద్యమం చేసిందట. చెట్లు బెరడులను కౌగిలించుకోవడం ద్వారా వాళ్ళు నరికివేతను అడ్డుకునేవారట. చివరికి కోపగించిన రాజుగారు అడ్డువచ్చిన వారిని కూడా నరికేయండని ఆగ్నాపించారట. రాజుగారి సైనికులు వాళ్ళ శరీరాలతో సహా దుంగలను కోసుకుపోయారట. దాదాపు నాలుగువందల మంది తెగ ప్రజలు ఈ ఉద్యమంలో ఇలా చంపివేయబడ్డారట. తమ పూర్వీకుల ఈ త్యాగాలను గుర్తుచేసుకుంటూ నేటికీ ప్రతీ సెప్టెంబరు నెలలో వీరు పండుగ చేసుకుంటారు. సుందర్ లాల్ బహుగుణ మొదలుపెట్టిన చిప్కో ఉద్యమానికి అమృతా దేవి చరిత్రనే ఆలంబన. చిప్కో ఉద్యమంలో కూడా ఆదివాసీ మహిళలదే కీలక పాత్ర. ప్రస్తుతం పది లక్షల మంది ఈ బిష్ణోయ్ మతానుయాయులు ఉన్నారట. చారల జింక, కృష్ణ జింక వారి జీవితంలో పెనవేసుకుని ఉన్న జంతువులు. తల్లులు తమ పిల్లలతో పాటు ఈ జింక పిల్లలకు కూడా తమ చనుబాలు ఇస్తారు. అంతగా వీరు జంతు ప్రేమికులు. తమ బిడ్డలాంటి ఒక బుజ్జి కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ అతడి మిత్ర బృందం వేటాడటం చూసింది ఈ బిష్ణొయ్ తెగ ప్రజలే. అందుకే శిక్ష పడే వరకూ వదలలేదు. గతంలో హైకోర్టు ఈ కేసులో సల్మాన్ పాత్ర లేదని తేల్చినా, మరలా కేసును సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించింది ఈ బిష్ణోయ్ మతస్థులే.
“ప్రపంచంలో ప్రతీ జీవికీ బతికే హక్కు ఉంది, ఏ జీవినీ చంపడానికి వీలు లేదు” అనే ఫిలాసఫీ తో బిష్ణోయ్ ప్రజలు జీవిస్తారు. ఈ ఫిలాసఫీని తమ జీవితాల్లోకి తీసుకువచ్చి చాలా స్వచ్ఛంగా ప్రకృతితో మమేకమై బతుకుతుంటారు. ప్రపంచంలో ఎన్నో ఆదీవాసీ తెగల్లో ఇటువంటి ప్రకృతి ప్రేమ, జీవ కారుణ్యం కనిపిస్తూ ఉంటుంది. మన ఆధునిక సమాజాలకు కొరవడిన అంశమే ఇది. పైగా పలు రకాల జంతువుల మాంసాలను ప్యాకెట్లలో పెట్టి ఎగుమతులు చేసుకునే కాపిటలిస్టు సమాజాలకు జీవకారుణ్యం అంటే అర్థం కూడా కాదేమో. బాగా డబ్బుండి మదం నెత్తి కెక్కిన వారికి జంతువులను వేటాడటం ఒక సరదా. అలాంటి తలబిరుసుతనమే సల్మాన్ అండ్ గ్యాంగు లో కూడా ఉండింది. గతంలో అధికార బలాఢ్యుడైన రాజు అభయ్ సింగును ఎలా ఎదుర్కొన్నారో అలాగే ఇప్పుడు ధన గర్విష్టులైన ఈ సినిమా హీరోలనూ ఆ బిష్ణోయ్ ప్రజలు ఎదుర్కొన్నారు. చివరిదాకా పోరాడారు. విజయం సాధించారు. సల్మాన్ బృందం ఆ పశ్చిమ రాజస్థానీ ప్రాంతంలో కాక దేశంలో ఏ అడవిలో వేటాడినా కేసునుండి సునాయాసంగా తప్పించుకునేవారు. ఇప్పటికీ ఎందరో సినీ నటులు సంపన్న వర్గాల వారి పిల్లలూ జంతువుల వేటను తమ సరదాలాగా కొనసాగిస్తూనే ఉన్నారనేది బహిరంగ రహస్యం. కానీ సల్మాన్ అండ్ కో బిష్ణోయ్ ప్రాంతంలో వేటాడారు కనుకే శిక్షను తప్పించుకోలేక పోయారు. బిష్ణోయ్ ప్రజల వంటి ప్రకృతి ప్రేమికులు మరెక్కడా ఉండరు కాబట్టి.
లాంగ్ లివ్ బిష్ణోయ్.