మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పండగవేళ జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ఈ స్టేషన్లో లోకల్ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. అంతేగాక.. ఈ ప్రాంతంలో ఆఫీసులు కూడా ఎక్కువే. దీంతో సాధారణంగానే ఈ ప్రాంతం ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. శుక్రవారం కూడా అలాగే చాలా మంది ప్రయాణికులు వచ్చారు. అయితే ఉదయం వర్షం పడటంతో వారంతా కాసేపు అక్కడే ఉన్నారు. వర్షం ఆగిపోయిన తర్వాత ఒక్కసారిగా ప్రయాణికులంతా పాదచారుల వంతెనపైకి దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో స్టేషన్‌కు నాలుగు రైళ్లు ఒకేసారి వచ్చాయి. దీంతో ప్రయాణికులు హడావుడిగా వెళ్లే క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో కొందరు కిందపడిపోయారు. తొక్కిసలాట నుంచి తప్పించుకునేందుకు కొందరు వంతెన కడ్డీలు పట్టుకుని కిందకు దూకేశారు. ఈ ఘటనలో 22 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది రైల్వేస్టేషన్‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు వైద్యసాయం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది చాలా దురదృష్టకరం
ఘటనపై పశ్చిమ రైల్వే స్పందించింది. పండగ వేళ ఇది చాలా దురదృష్టకరమని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఘటనాస్థలానికి వస్తారని రైల్వే పీఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు. ‘భారీ వర్షం కారణంగా పెద్దసంఖ్యలో ప్రయాణికులు వంతెనపైకి చేరుకున్నారు. వర్షం ఆగిపోగానే వారంతా దిగేందుకు ప్రయత్నించగా.. తొక్కిసలాట జరిగింది’ అని సక్సేనా తెలిపారు.