శాసనసభలో కేసీఆర్ కిట్లు పథకంపై లఘు చర్చ జరిగింది. సభ్యులందరూ మాట్లాడిన తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చారు. కేసీఆర్ కిట్లు పథకాన్ని కూడా విపక్షాలు విమర్శించడం తగదన్నారు. కేసీఆర్ కిట్.. సూపర్ హిట్ అని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు పథకం అమలు వెనుక గొప్ప విజన్ ఉందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, హరితహారం, కేసీఆర్ కిట్లు లాంటి పథకాలు ప్రజలు ఆరోగ్య కోసం తీసుకువచ్చిన పథకాలు అని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
జబ్బు చేశాక బాధపడడం కంటే.. జబ్బు రాకముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కిట్ పథకం తీసుకువచ్చామని మంత్రి స్పష్టం చేశారు. జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ప్రసవాల సంఖ్య రెట్టింపు అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రుల్లో 94 వేల ప్రసవాలు జరిగితే.. 92 వేల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు పథకం కింద నగదు నాలుగు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. పథకం అమల్లో అవకతవకలకు అవకాశం లేదన్నారు. మొత్తం ఆన్‌లైన్‌లో నమోదు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ పథకం ద్వారా గర్భిణీలను త్వరగా గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు చేసి మందులు అందజేస్తామన్నారు. అన్ని జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఐఎంఆర్‌ను 39 నుంచి 28కి, ఎంఎంఆర్‌ను 70కి తీసుకురాగలిగామని చెప్పారు. కేసీఆర్ కిట్ల పథకం విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు బాగా కష్టపడుతున్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచుతున్నామని పేర్కొన్నారు. మేడ్చల్, ఆసిఫాబాద్ జిల్లాలకు కొత్త ఆస్పత్రుల ప్రతిపాదన ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును పూర్తిగా మార్చేశామన్నారు. గవర్నమెంట్ దవఖానాలను మెరుగుపరుస్తూ సిబ్బంది కొరతను తీరుస్తున్నామని తెలిపారు. వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న 4 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.