తనపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లని నడిరోడ్డుపై ఉరితీయాలని భోపాల్ అత్యాచార బాధితురాలు డిమాండ్ చేసింది. ఆదివారం ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ…. ‘రేపిస్టులను వదిలిపెట్టొద్దు. వారిని నడిరోడ్డుపై ఉరి తీయండి. నాకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు సహకరించలేదు సరికదా హేళనచేసి మాట్లాడారు. ఆ ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్ను తిప్పించారని ఆ బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది.సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్న యువతిపై మంగళవారం రాత్రి నలుగురు కామాంధులు సుమారు మూడు గంటలపాటు బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు.
అక్టోబరు 31 న జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళితే బాధితురాలి పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఆమె ఫిర్యాదు సినిమా కథలా ఉందని హేళన చేశారు. నిందితులను పట్టించి, ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నంత వరకు పోలీసులు స్పందించలేదు. విమర్శలు చెలరేగడంతో ఈ ఘటనపై విచారణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటుచేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను విధుల నుంచి తొలగించడంతోపాటు మరో అధికారిని బదిలీ చేశారు.
బాధిత యువతి తల్లిదండ్రులు కూడా పోలీసులే కావడం గమనార్హం. తండ్రి ఎస్ఐ, తల్లి సీఐడీ విభాగంలో పనిచేస్తోంది. ఈ ఘటనతో రద్దీగా ఉన్న ప్రాంతంలోనే అభాగ్యురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వే భద్రత దళం పోలీస్ స్టేషన్‌కు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటుచోసుకున్న ఈ ఘటనతో భోపాల్ నగరం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై బాధితురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటని వాపోయారు. ఇది తమ జీవితంలో ఎదురైన అత్యంత దౌర్భాగ్యమైన అనుభవమని పేర్కొన్నారు.