24 గంటల విద్యుత్ సరఫరా దేశంలోని అన్నివర్గాలను చూపును తెలంగాణవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే ఈ నిర్ణయం వెలువడిందనే సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక ఎంత కృషి ఉందో తాజాగా శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న సమర్ధవంతమైన చర్యల వల్లే మూడున్నరేండ్లలోనే పసికూన తెలంగాణ చీకట్లను తరిమేసి వెలుగులు మిరుమిట్లు కొలిపే రాష్టంగా కీర్తించబుడుతున్నదని అన్నారు.
అర్ధరాత్రి 12గంటల ఒక నిమిషానికి అద్భుతమైన కాంతులు విరజిమ్ముతూ 2018 సంవంత్సరం మొదలైందని , ఇదో అద్భుత విజయమని ఎమ్మెల్సీ పల్లా అన్నారు. 24గంటల విద్యుత్ సరఫరాతో రాష్ట్రంలోని రైతులు, పారిశ్రామిక వేత్తలతో సహా అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మొనగాడు కేసీఆర్ అని ప్రజలు అభినందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కరెంట్ అడిగినందుకు రైతులను కాల్చి చంపిన చరిత్ర టీడీపీదని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ప్రజలను మభ్యపెట్టిందని, ఈ రెండు ప్రభుత్వాల హయాంలో కరెంట్ ఇవ్వకుండా తెలంగాణను అంధకారం చేశారన్నారు. విభజిస్తే తెలంగాణ చీకట్లమయబవుతుందని చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు ఇంకా తెలంగాణ ప్రజల చెవిలో మారుమోగుతూనే ఉన్నాయని రాజేశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కూడా కరెంట్ అంశమే ప్రధానంగా మారిందన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాత విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం నుంచి రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా చంద్రబాబు తొండి చేశారని, రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ ద్వారా సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి కట్టబెట్టారని ఆయన అన్నారు. 24గంటల కరెంట్ ఇస్తే తానే స్వయంగా టీఆర్‌ఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారి కారు గుర్తుకు ఓట్లు వేయమని అడుగుతానని విపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారని, తెలంగాణ మని చేతికి వచ్చే నాటికి కరెంట్ ఇబ్బందులతో ఇన్వర్టర్లు, జనరేటర్ల మోత మోగుతుండేదని, వచ్చీ రాని కరెంట్‌తో ఎక్కడ చూసినా పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయిన మోటార్లు, స్టార్టర్లు కనిపించేవని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే ప్రతిపక్షాలు ‘ఏమైంది చత్తీస్‌ఘడ్ ఒప్పందం, కరెంట్ రాదా? తీగలపై బట్టలారేసుకోవాల్సిందేనా?` అని ఎగతాళి చేశారని ఆయన చెప్పారు.
కానీ కేసీఆర్ అన్ని సమస్యలను అధిగమిస్తూ విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేశారని విప్ పల్లా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిన జైపూర్, భూపాలపల్లి విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. వార్థా-హైదరాబాద్ లైన్ పూర్తి చేయించేంత వవరూ కేసీఆర్ విశ్రమించలేదన్నారు. విద్యుత్ శాఖలో 16కొత్త ఉద్యోగాలను నియమించడంచ 24వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించడం విద్యుత్ రంగం బలోపేతం కావడానికి కారణమన్నారు. కాంగ్రెస్ నాయకులు కేసుల మీద కేసులు వేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టులతో పాటు కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టులో మరో దశను చేపట్టి ముందుకు పోతున్నదన్నారు.
ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను నివారించిన ప్రభుత్వం రూ.12,316 కోట్లు వ్యయం చేసి 514 కొత్తసబ్‌స్టేషన్లను. 1724 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడమేకాకుండా 19,154 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లు వేసినట్లు రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. 24గంటల కరెంట్ సరఫరా తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమని, ఈ కొత్త సంవత్సరంలో ఇంకా భూరికార్డుల ప్రక్షాళన, ఎకరానికి రూ.8వేల పెట్టుబడి, 196 కేసులతో అడ్డుపడినా 215 అనుమతులు సాధించుకొని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకోవడం వంటి అనేక అద్భుత విజయాలు దక్కనున్నాయన్నారు. దేశంలోనే 24గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కొందరు కుహన రాజకీయ నాయకులు 24గంటల విద్యుత్ వెనుక మతలబు ఏమిటన్ని విషం కక్కుతున్నారని, అలాంటి వారు విద్యుత్ తీగలు పట్టుకుంటే మతలబు తెలుస్తుందన్నారు. 90వేల కోట్ల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పనులను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తూ అరగంటలోనే జీవో జారీ చేసిన మొనగాడు కేసీఆర్ అని ఆయన చెప్పారు.