అయోధ్య శ్రీ రాయుడిదే అంటూ ఇటీవల సుప్రీంకోర్ట్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు పట్ల దేశవ్యాప్తంగా ముస్లింలతో సహా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య తీర్పుతో దేశంలో మత కల్లోలాలు రెచ్చగొట్టాలని చూసిన ఐసీస్ , జైషే మహ‌్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. కాగా అయోధ్యలో భారీ రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో రగిలిపోతున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అయోధ్యపై భారీ ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ టెలిగ్రామ్ యాప్ ద్వారా పంపిన సందేశాలను నిఘావర్గాలు అడ్డుకుని, నిశితంగా పరిశీలించినపుడు అయోధ్యపై భయంకర దాడికి కుట్ర జరుగుతుందన్న విషయం బయటపడింది. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలో భీకర దాడులకు పన్నాగం పన్నుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. జైషే మహ్మద్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలు తమ ఉగ్రవాదులు, మద్దతుదారులకు సమాచారం ఇచ్చేందుకు, వారి నుంచి సమాచారం పొందేందుకు టెలిగ్రామ్ యాప్‌ను ఉపయోగిస్తాయి. దీంతో ఈ యాప్‌లోని సందేశాలను భారత నిఘావర్గాలు డీకోడ్ చేయగా.. అయోధ్యపై దాడికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని గుర్తించారు. దీంతో కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థ ఈ విషయాన్ని సంబంధిత భద్రతా దళాలకు తెలియజేశాయి. మొత్తంగా అయోధ్యపై భారీ ఉగ్రవాడికి కుట్ర చేస్తున్న విషయం బయటపడడంతో కేంద్రం అప్రమత్తమైంది. అయోధ్యలో భద్రతను మరింతగా పెంచింది. మరోవైపు ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు భద్రతాదళాలు అయోధ్యను జల్లెడ పడుతున్నాయి.
