ఉమ్మడి ఏపీ విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందని, అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని మండలిలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని చెప్పారు. ‘వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ దగ్గరుండి ఏపీకి ఇప్పించారు.
తెలంగాణకు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. ఢిల్లీ నుంచి రావడం ఒక ప్రెస్ మీట్ పెట్టడం కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం ఇదే పని. కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా? తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు ఉందా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను చూసి భయపడుతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేతకాని చవటలు, దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నం. కేంద్రం చూపిస్తున్న వివక్షను ఖండిస్తున్నా. తెలంగాణలో కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి, మతచిచ్చు మంటల్లో చలి కాచుకుందామంటే తెలంగాణ ప్రజలు సహించరు. బీజేపీ ముక్త భారత్ కావాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి’ అని ఆయన శాసన మండలిలో పేర్కొన్నారు.