టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి కీలక డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు అత్యంత వేగంగా పార్లమెంట్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆ బిల్లును ప్రవేశపెట్టిన రోజే అది అన్ని అడ్డంకుల నుంచి క్లియర్ అయ్యింది. లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ ఆ బిల్లు చాలా వేగంగా ఆమోదం పొందింది. ఆ బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు కూడా స్వాగతించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో గతంలో పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లు రాజ్యసభలో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ కవిత స్పందించారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు అంతే వేగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించాలని ఎంపీ కవిత కోరారు. ఈబీసీ బిల్లును ఎంత వేగంగా పాస్ చేశారో.. అంతే స్పీడ్‌తో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే.. దేశం నిజంగానే ప్రగతి సాధిస్తుందని ఆమె అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం దక్కాలంటే, దానికి బలమైన రాజకీయ సంకల్పం ఉండాలని ఎంపీ కవిత తెలిపారు.