Home / 18+ / క్షణక్షణం భయం.. భయం ఎమర్జెన్సీ ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు

క్షణక్షణం భయం.. భయం ఎమర్జెన్సీ ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు

బాంబుదాడులతో దద్దరిల్లిన శ్రీలంక.. ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకున్నది. ఆదివారంనాటి మారణహోమం కండ్లముందు కదులుతుండగానే.. సోమవారం కొలంబోలోని మరో చర్చి వద్ద బాంబు పేలింది. భద్రతా బలగాల తనిఖీల్లో పేలని బాంబులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య సోమవారానికి 290కి పెరిగింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు నిర్ధారించారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు సోమవారం అర్ధరాత్రి నుంచి దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. ఈ దాడుల వెనుక నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నదని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటివరకు 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాంబులను అమర్చడంతోపాటు ఆత్మాహుతి దాడికి పాల్పడినవారంతా స్థానికులేనని ప్రభుత్వం ప్రకటించింది. వీరికి విదేశీ ఉగ్రసంస్థలు సాయం అందించి ఉంటాయని అనుమానిస్తున్నది. ఉగ్రవాదులు మరిన్ని దాడులు జరుపవచ్చని అమెరికా హెచ్చరించింది.

ఇది ఇలా ఉండగా శ్రీలంక పేలుళ్లలో మృతిచెందిన భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి ముగ్గురు మరణించినట్టు నిర్ధారణ కాగా.. సోమవారానికి ఈ సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ మేరకు విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మరో ఐదుగురు భారతీయులు వేమూరి తులసీరామ్, ఎస్‌ఆర్ నాగరాజు, కేజీ హనుమంతరాయప్ప, ఎం రంగప్ప, హెచ్ శివకుమార్ మృతదేహాలను గుర్తించినట్టు శ్రీలంక విదేశాంగశాఖ సమాచారం అందించిందని చెప్పారు.