సొంత పిన్నితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తనకు అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతో పినతండ్రినే హతమార్చాడు. ఈ నెల 13న విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసకు చెందిన బాడిదపోయిన రాములప్పడు (30) విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లిలో హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు గౌరి అందించిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఆనందపురం పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. విచారణ పూర్తి చేసిన సీఐ ఆర్.గోవిందరావు అందించిన నివేదిక మేరకు శనివారం మధురవాడ ఏసీపీ బీవీఎస్. నాగేశ్వరరావు నిందితుడిని అరెస్టు చేసి భీమిలి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 13న రాములప్పడు తన భార్య నర్సయ్యమ్మ (28)తో కలిసి గొట్టిపల్లిలో ఉంటున్న తన తోడళ్లుడు గండిబోయిన రమణ ఇంటికొచ్చారు. రమణకు అప్పలరాజు(21), యల్లారావు అనే ఇద్దరు కుమారులున్నారు. పిన్ని నర్సయ్యమ్మ కోరిక మేరకు పినతండ్రి రాములప్పడుకి భయం చెప్పాలని సోదరుడు యల్లారావుతో చెప్పిన అప్పలరాజు.. అతడిని సమీపం గ్రామంలోకి మద్యం తాగుదామని తీసుకెళ్లారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి సాయంత్రం 5 గంటలకు గొట్టిపల్లికి సమీపంలో డబ్బీరు శ్రీనివాసరావుకు చెందిన మామిడితోటలో రాములప్పడితో మద్యం తాగించారు. ఆ మైకంలో ఉన్న అతడిని సరుగుడు మోడుతో బాదడంతో మృతి చెందాడు. అతడు గెడ్డలో జారి పడిపోయినట్లుగా ఇతర కుటుంబీకులను నమ్మించారు. మద్యం మత్తుతో పడిపోయి ఉంటాడని భావించిన కుటుంబీకులు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వద్దకు ఆటోలో తీసుకెళ్లగా మృతి చెందినట్లు చెప్పడంతో అదే ఆటోలో మోదవలసలోని రాములప్పడు ఇంటికి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీసుకెళ్లారు. రాములప్పడి బంధువులు అతడి మృతికి కారణాలపై ఆరా తీయడం, శరీరంపై స్వల్ప గాయాలు కన్పించడంతో అనుమానంతో ఆనందపురం పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేసిన పోలీసులకు వాస్తవాలు వెల్లడయ్యాయి. కొడుకు వరుసైన వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకోవడాన్ని ప్రశ్నించిన భర్తను తొలగించుకోవాలని నర్సయ్యమ్మ కుట్రపన్ని అప్పలరాజుతో హత్యకు ప్రణాళిక రూపొందించిందనితెలిపారు.
ఈ కేసులో గండిబోయిన అప్పలరాజు (21), గండిబోయిన యల్లారావు(19), నర్సయ్యమ్మ(28)ను శనివారం భీమిలి కోర్డులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసు సీఐ ఆర్.గోవిందరావు, ఎస్.నమ్మి గణేష్ దర్యాపు చేశారు.