ఓ యజమాని నమ్మి పనికి పెట్టుకుంటే.. యజమాని ఇంట్లో లేని సమయంలో.. ఆయన భార్య స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను ఆ ప్రబుద్ధుడు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించబోయాడు. సోమవారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘాతుకాన్ని పసిగట్టిన ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ పనివాడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… ముంబైలోని చించిపోక్లి టవర్ లో నివసిస్తున్న ఓ వ్యాపారి ఏడాదిన్నర క్రితం బీహార్ కు చెందిన కైలాష్ యాదవ్(20) ను తన ఇంట్లో పనికోసం పెట్టుకున్నాడు.
ఆయన భార్య(30) సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో బాత్రూంలోకి వెళ్లి స్నానం చేస్తూ.. వాష్ బేసిన్ కింద ఉన్న బాక్స్ లో సబ్బుల నడుమ ఒదిగి ఉన్న మొబైల్ ఫోన్ ను చూసింది. అది తమ ఇంట్లో పనిచేసే కైలాష్ యాదవ్ ది కావడంతో ఆమెకు అనుమానం వచ్చి తీసిచూసింది. ఆ సమయంలో ఆ మొబైల్ ఫోన్ రికార్డింగ్ మోడ్ లో ఉండడంతో ఆమె షాక్ తింది. తాను బాత్రూంలో ప్రవేశించడానికి ముందే కైలాష్ యాదవ్ దాన్ని జాగ్రత్తగా సబ్బుల నడుమ అమర్చి బయటికి వెళ్లి ఉంటాడని ఆమెకు అర్థమైంది. తాను స్నానం చేసే దృశ్యాలను రికార్డింగ్ చేసేందుకే అతడు దానిని అక్కడ అమర్చాడని, అప్పటికే ఆ మొబైల్ ఫోన్ లో తన బాత్రూం సీన్ కు సంబంధించి రెండు మూడు నిమిషాల వీడియో రికార్డయి ఉందని తెలియగానే ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆమె కళాచౌకి పోలీసులకు ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకుని కైలాష్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు అతడిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.