ఇద్దరు విద్యార్థినుల మధ్య తలెత్తిన ప్రేమ వివాదం ఒకరి నిండుప్రాణాల్ని బలిగొంది. ఎస్పీ అనంతశర్మ తెలిపిన ప్రకారం… ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన రాంబాయి, సీతయ్యల కుమార్తె శ్రీలక్ష్మి(19) జగిత్యాల జిల్లా కొడిమ్యాల జేఎన్టీయూ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. కళాశాల వసతిగృహంలో ఉంటోంది. శ్రీలక్ష్మికి ఇదే కళాశాలలో గత సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె బావ హరీష్‌కు ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఇదిలా ఉండగా ఇదే కళాశాలలో చదువుతున్న మరో విద్యార్థిని, హరీష్ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మికి చరవాణి ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వగా ఆమె తిరిగి ఫోన్ చేసింది. నేను.. మీ బావ ప్రేమించుకుంటున్నాం.. మీ బావను నువ్వు మరిచిపోవాలని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీలక్ష్మి తన బావనే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య సుమారు రెండు గంటలపాటు వాగ్వాదం జరిగింది. శనివారం ఉదయం శ్రీలక్ష్మి తన తల్లికి, బావ హరీష్‌కు చరవాణిలో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడింది. తరువాత 11.30గంటల సమయంలో వసతిగృహానికి చేరుకుంది. మధ్యాహ్నం భోజనానికి వెళ్లడానికి ముందు ఆమె స్నేహితురాళ్లు గదికి వచ్చి శ్రీలక్ష్మిని పిలువగా ఎంతకీ తలుపు తీయలేదు. తలుపు పగలగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించింది. వసతిగృహ వార్డెన్ ఫిర్యాదు మేరకు హరీష్, అతను ప్రేమించిన విద్యార్థినిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
