ఎక్కడ చూసిన మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. ఒంటరిగా ఉన్న సమయంలోనే కాదు పబ్లిక్ ప్రదేశాల్లో కూడ మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినా కానీ, నిందితులు మాత్రం తమ ఆగడాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(20) నగరంలోని శంకర్‌పల్లిలో ఎంబీఏ చదువుతోంది. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మన్నె రవిచంద్ర గచ్చిబౌలిలో ఉంటూ ప్రైవేటు హాస్టల్ నిర్వహిస్తున్నాడు. 23వ తేదీన 11 గంటల సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు మార్నింగ్‌స్టార్ ట్రావెల్స్ బస్సులో రవిచంద్ర, అతని భార్య సీటు బుక్ చేసుకున్నారు. అదే బస్సులో ఎంబీఏ విద్యార్థిని తనకు కాబోయే భర్తతో అదే బస్సులో ప్రయాణిస్తున్నారు. రవిచంద్ర భార్యకు సీటు దొరకగా అతనికి సీటు దొరకకపోవడంతో బస్సు డ్రైవర్ వెనుకాల కూర్చున్నాడు.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెనకకు వెళ్లిన రవిచంద్ర ఎంబీఏ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అప్రమత్తమైన విద్యార్థిని పక్కనే ఉన్న కాబోయే భర్తకు విషయం చెప్పింది. అప్పటికే బస్సు హయత్‌నగర్ చేరుకోవడంతో బాధిత విద్యార్థిని హయత్‌నగర్, షీటీమ్ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిచంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.